ప్రతీ దివ్యాంగుని వైకల్యాలు, అనుభవాలు మరియు అవసరాలు వారి వైకల్య స్థితిని బట్టి భిన్నంగా ఉంటాయి. వైకల్యం అనేది మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేస్తుంది. వైకల్యం ఉన్న వ్యక్తి యొక్క సంక్లిష్ట అవసరాలను తీర్చడం కుటుంబాన్ని చాలా ఒత్తిడికి గురి చేస్తుంది (భావోద్వేగ, ఆర్ధిక మరియు కొన్నిసార్లు శారీరకంగా కూడా).
అందరిలాగే దివ్యాంగులు కూడా బయట ప్రపంచాన్ని చూడాలని దానిని ఆస్వాదించాలని, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆశలు, ఆశయాలు కలిగి ఉంటారు. కానీ వారి బాల్యం నుండి వారికున్న వైకల్యం కారణంగా చాలా సంధర్భములలో వివక్షకు గురి అవుతుండటం వలన వారు నిరాశ, నిస్పృహ చెందుతుంటారు. ఏమి చేస్తే ఏమి జరుగుతుంది? ఎవరు ఏం విమర్శిస్తారు? ఇది మనవలన సాధ్యమేనా? అనే పలురకాల భయం దివ్యాంగులను మరొక కోణంలో వేదిస్తుంటుంది.
కొందరి అజ్ఞానుల, విమర్శకుల మాటలు వారిని ప్రభావితం చేస్తుంటాయి. ఇటువంటి సంద్భములలో చాలా మంది వారి భవిష్యత్తు గురించి ఆందోళన చెంది వారు తమ తల్లి తండ్రులకు భారం కాకూడదు అని తలంచి ఆత్మహత్యలకు పాల్పడినవారిని మనం చూస్తుంటాము.
ఇలా వైకల్యం ఒక మనిషి జీవితాన్ని వ్యక్తిగతంగా, సామాజికంగా చాలా ప్రభావితం చేస్తుంది. అయితే వైకల్యం కలిగిన వారు వీటన్నిటినీ అధిగమించి వారు భవిష్యత్తును గురించిన ప్రణాళికను కలిగి దానిని అద్భుతంగా తీర్చిదిద్దుకొనే లక్ష్యం కలిగి ఉండాలి. పైన చెప్పబడినవన్నీ ఒక దివ్యాంగురాలిగా నా బాల్యం నుండీ నేను అనుభవించిన మరియు నన్ను ప్రభావితం చేసిన పరిస్థితులను ఆధారము చేసుకొనినవే.
తాము కోరుకున్న ఉన్నత శిఖరాలకు దివ్యాంగులు కూడా చేరుకోవాలి. వైకల్యం విజయానికి అడ్డుబండ కాదు అను ఆర్టికల్ తో మరొకసారి మీ ముందుకు వస్తాను.