Hello there! Thanks for dropping by. Dive into a world of inspiration and information😊

వైకల్యం విజయానికి అడ్డుబండ కాదు

    మొదటిగా నా బ్లాగ్ వీక్షిస్తున్న సహోదర/సహోదరీలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    వైకల్యం అనేది రోజువారీ జీవతంలో అడ్డంకి కాదు కానీ అది ఒక సవాలుగా పరిగనించబడుతుంది. దురదృష్టవశాత్తు, చాలా మంది వ్యక్తులు విజయాన్ని ప్రత్యేకంగా సామాజిక ఆర్థిక కోణంలో చూస్తారు. అయితే విజయం ప్రతి ఒక్కరికీ భిన్నంగా ఉంటుంది. కొంతమంది ఇతర వ్యక్తుల దృష్టిలో ఉండాలని కోరుకుంటారు, మరికొందరు ఈ నేపథ్యంలో నిశ్శబ్దంగా అద్భుతమైన విజయాలను సాధించాలని కోరుకుంటారు. 

    సాధారణంగా వైకల్యం గల వ్యక్తులను గురించి వారికి వైకల్యం ఉన్నందున వారు మంచి గ్రేడ్‌లు పొందలేరని, కళాశాల/విశ్వవిద్యాలయంలోకి వెళ్లి చదువలేరని లేదా వారి కలల ఉద్యోగాన్ని పొందలేరను తప్పు అభిప్రాయమును కొందరు కలిగి ఉంటారు. ఈ విషయమై నా జీవితములో జరిగిన సంఘటనను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

  నేను తొంభై శాతం శారీరక వైకల్యం కలిగియున్న వ్యక్తిని. అయితే ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తరువాత బీటెక్ చేయవలసివస్తే హాస్టల్ నందు ఉంటూ, తల్లిదండ్రులకు దూరముగా ఉంటూ చదువుకోవాలి, వికలాంగురాలిగా నా పనులు నేను చేసుకొనలేనని తలంచి డిగ్రీ చదువుదామని నిశ్చయించుకొని ఎంసెట్ కోచింగ్ తీసుకొనలేదు. అయినా సరే ఎంసెట్ వ్రాయటం, మంచి ర్యాంకు సాధించటం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కోసం కౌన్సిలింగుకు వెళ్ళినపుడు నాకు వైజాగ్ గీతం యూనివర్సిటీలో ఫ్రీ సీట్ లభించింది. ఫార్మాలిటీస్ అన్ని ముగించుకొని ఇంటికి వచ్చినా నా మనసు ఇంకా డిగ్రీ మీదనే ఉంది కానీ బీటెక్ చదవడం ఇష్టం లేదు దానికి గల కారణం నేనొక కంఫర్ట్ జోనుకు అలవాటు పడియున్నాను. 

    నా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నన్ను వైజాగులో జాయిన్ చేయుటకు అన్ని ఏర్పాటులు చేస్తున్న సమయములో మా బంధువులలో ఒకరు నా తల్లిదండ్రుల యొద్దకు వచ్చి ఒక ఆడపిల్ల అందులోనూ వైకల్యం గల అమ్మాయి ఏమి చదువుతుంది? ఏమి ఉద్యోగం చేయగలదు? డబ్బులు ఎందుకు వ్యర్ధంగా ఖర్చుపెడుతున్నారని నిరుత్సాహపరిచే మాటలు పలికి వెళ్ళిపోయారు. కానీ నా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించి బీటెక్ లో జాయిన్ చేసి అన్ని సౌకర్యాలు నాకు చూసి నన్ను అక్కడ విడచిపెట్టి వెళ్లియున్నారు. 

    నేను మొదటిసారి ఆ కాలేజీను చూసినపుడు అది ఒక మహా సముద్రంలా కనిపించింది. ఎందుకంటే కొండలు చదును చేసి నిర్మించబడిన కాలేజీ కనుక ఎత్తు పల్లాలు కలిగిన ప్రాంతం అది. ఇక్కడ ఉండటం నాకు సాధ్యమేనా? నేను ఎన్నడూ నడవలేని అంత దూరం కాలేజీకి నడచి వెళ్ళాలి కదా? నా శరీరం నాకు సహకరిస్తుందా? అని పలు ప్రశ్నలు నన్ను భయానికి గురి చేసాయి.

    అయితే మా బంధువులలో ఒకరు నా తల్లిదండ్రుల యొద్దకు వచ్చి అన్న మాటలు గుర్తు వచ్చి కష్టం అయినా సరే నేను బీటెక్ పూర్తి చేసి అతని మాటలకు తగిన సమాధానం చేతలలో చూపించాలి అని నా మనస్సు ధృడ పర్చుకొని దేవుని మీద భారం వేసి ఒక సవాలుగా తీసుకొని బీటెక్ చదివాను. ప్రస్తుతం ఒక ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను. 

   మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడు. ఎవరికైనా తగినంత బలమైన ఉద్దేశ్యం,  అంకితభావం మరియు దృఢ సంకల్పం ఉంటే, అతను/ఆమె శారీరక లేదా మానసిక వైకల్యాన్ని అధిగమించగలరు. ఎవరైనా వైకల్యాన్ని అధిగమిస్తే, అది విజయానికి ఎప్పటికీ అడ్డుబండ కాదు.

     నేను నా కంఫర్ట్ జోన్ దాటి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టకుంటే నేటికీ నేను కొన్ని విజయాలను సాధించలేని స్థితిలో ఉండేదానినేమో! ఒక వైకల్యం కలిగిన వ్యక్తి జీవితం నాలుగు గోడలకే పరిమతం అని తలంచిన నేను బీటెక్ చదివిన నాలుగు సంవత్సరాలలో జీవితం అంటే ఏమిటో, మనము కూడా విజయాలను సాధించగలమని అనుభవపూర్వకంగా రుచి చూసి తెలుసుకున్నాను. నేనొక మార్గాన్ని ఎంచుకుంటే దేవుడు వేరొక మార్గంలోకి తీసుకువెళ్ళి విజయ బాట వైపు నడిపించారు.

   వైకల్యం ఉన్నప్పటికీ దానిని అధిగమించి జీవితమును ఎలా ముందుకి నడిపించాలో నేర్చుకున్నాను. ఈ నేర్చుకుంటున్న క్రమంలో ఎన్నో ఓటములను చూసాను, ఇబ్బందులు ఎదుర్కొన్నాను, విమర్శలకు గురి అయ్యాను మరియు ద్వేషించబడ్డాను కూడా. ఈ పరిస్థితులన్నీ నేను పదునుగా మారుటకే దేవుడు అనుమతించారు అని నమ్మి ముందుకు సాగి స్వతంత్రముగా జీవించటం అలవాటు చేసుకున్నాను. 

    మీరు కష్టపడుతున్నప్పుడు వైకల్యాలు లేని ఇతరుల విజయాలను చూసి మేము సాధించలేము అను సందేహము బాధ కలిగించవచ్చు. మీ లక్ష్యం సహేతుకంగా ఉన్నంత కాలం, మీరు ఏకాగ్రతతో ఉంటే చివరికి మీరు విజయం సాధిస్తారు. వైకల్యాన్ని పరిమితిగా చూడకుండా, మనము కలిగి ఉన్న సామర్థ్యాలు మరియు బలాలను గుర్తించగలగాలి. ఈ మార్పు విజయానికి అవకాశాలను సృష్టించడంలో సహాయపడుతుంది. మనం ధృడ సంకల్పంతో ముందుకి సాగినపుడు మనకు దైవ బలం కూడా తోడు అవుతుంది అని నేను నమ్ముతాను. 

    అసమానతలు మీకు వ్యతిరేకంగా ఉన్నాయని మీకు అనిపిస్తే, వాటిని ధిక్కరించడం సాధ్యమని మీరు తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. జ్ఞానం, స్వీయ అంగీకారం, స్వీయ ప్రేమ, పట్టుదల, మీ మిద మీకు ఉన్న నమ్మకం మరియు అంతర్గత శాంతి. ఇవి మీరు తప్పనిసరిగా సంపాదించవలసిన జీవితాన్ని మెరుగుపరిచే లక్షణాలు. మీరు మీ లక్ష్యాలను సాధించినప్పుడు, అది అద్భుతమైన అనుభూతి అవుతుంది!

ప్రజల మనోభావాలు మీరు విజయం వైపు అడుగులు వేయకుండా ఎందుకు ఆపాలి?

   నన్ను ప్రోత్సహించే, నన్ను ప్రేరేపించే మరియు కష్టపడి పనిచేయడానికి నన్ను పురికొల్పే వ్యక్తులతో నేను అనుదినము సన్నిహిత సంబంధం కలిగియుంటాను. వారి నుండి అనుదినము ఏదో ఒక మంచి ఉపయోగకరమైన విషయం నేర్చుకొని దానిని నా లక్ష్యానికి సాధనముగా వాడుకుంటాను. ఎందుకంటే ఆ సన్నిహితులు నా సామర్థ్యాలను చూస్తారు కానీ నా పరిమితులను కాదు. మన చుట్టూ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించగలిగితే దేనినైనా సులభంగా ఎదుర్కొనగలము. 

     చివరిగా నా సారంశము - విజయం సాధించడానికి కృషి చేయండి, మీరు కోరుకున్న విధంగా జీవితాన్ని గడపండి మరియు మీ వైకల్యం కారణంగా మీరు ఏమీ చేయలేరని ఏ వ్యక్తి మీ గురించి మాట్లాడుటకు అవకాశమివ్వకండి. మీరు విజయం సాధించగలరని మరియు మీ లక్ష్యాలను సాధించవచ్చని గుర్తుంచుకోండి. 

    ఒక విజయపు మెట్టు దగ్గరే ఆగిపోకుండా ఉన్నత శిఖరాలకు చేరుకొని అనేక మంది వికలాంగులకు ఆదర్శంగా, ఉపయోగకరంగా ఉండు నిమిత్తమే నా ఈ తపన. 

నా ఆర్టికల్ చదివిన మీరు ప్రేరేపించబడితే విజయం పొందడానికి మీరు నేర్చుకున్న అనుభవాలను కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. 


* వికలాంగుల విజయగాధల కొరకు క్లిక్ చేయండి Success Stories

 

2 కామెంట్‌లు:

  1. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మేడం గారు. మీరు ఈ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, రాజపూజ్యంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న మీ శ్రేయోభిలాషి. నేను మీకు పెద్ద అభిమానిని మేడం గారు. మీరు మెయిల్ కి ఇచ్చిన రిప్లై ప్రతి రోజు చదువుతూ నన్ను నేను ఉత్సాహపరచుకుంటున్న. మీ గైడెన్స్, కౌన్సిలింగ్ కొరకు థ్యాంక్ యూ మేడం గారు. మిమ్మలిని ఒకసారి అయిన కలిసి మీతో ఫోటో తీసుకోవాలి అని నా అభిలాష మేడం. మీ గురించి అందరికి చెపుతున్న మేడం. ప్రతి రోజు మీ సైట్ ఓపెన్ చేసి చూస్తాను. భావోద్వేగాలు పార్ట్ ఎప్పుడు పోస్ట్ చేస్తారు మేడం??

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Thank you. Wish you the same. భావోద్వేగాలు పార్ట్ - 1 పోస్ట్ చేశాను చూడండి

      తొలగించండి