నా బ్లాగ్ వీక్షిస్తున్న సహోదర/సహోదరీలు అందరికీ శుభోదయం. నేను పోస్ట్ చేసిన వైకల్యం విజయానికి అడ్డుబండ కాదు అను ఆర్టికల్ మీరందరూ చదివి మరికొందరికి షేర్ చేసారని అనుకుంటున్నాను.
మీకొక ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేయాలని మరొకసారి మీ ముందుకు వచ్చాను. ఆ వ్యక్తి ఎవరో కాదండీ మన ఆంధ్ర రాష్ట్రంలోనే నివసిస్తున్న వైజాగ్ వాసి దిలీప్ పాత్రో గారు.
పరిచయం:
04-08-1970 తేదిన బరంపూర్, గంజాం జిల్లా, ఒడిశా రాష్టంలో దిలీప్ పాత్రో గారు జన్మించారు. దిలీప్ గారి తండ్రి వ్యాపారి. ఆయనకు మూడవ సంతానం దిలీప్ పాత్రో గారు.
![]() |
| ఆక్సిడెంటుకు ముందు ఫోటో |
ఎదుర్కొన్న సవాళ్లు:
పాస్పోర్ట్ వీసా తీసుకొని రాత్రి 11:00 గంటలకు ముంబై హైవేలో ఆయన ఉంటున్న రూముకి తిరిగి వస్తుండగా రోడ్ క్రాస్ (జీబ్రా క్రాసింగ్) చేసే సమయంలో వెనుకనుండి ద్విచక్ర వాహనం మీద వేగంగా వస్తున్న ఒక వ్యక్తి దిలీప్ గారి బండిని పంచ్ చేసి బండిని వదిలేసి పారిపోయాడు. దిలీప్ గారు బండి మీద నుండి పడిపోయిన నాలుగు నుండి అయిదు గంటల వరకూ, ఆయన్ని వచ్చి చూసి వెల్పోయిన వారే గాని ఎవరూ పట్టించుకున్న వారు లేరు. ఆ సమయంలో దిలీప్ గారు స్పృహలో లేరు. అటు తరువాత వేకువ జామున 4:30 గంటల సమయంలో ట్రాఫిక్ పోలీసు వారు షిఫ్ట్ డ్యూటీ మారడానికి వచ్చినపుడు దిలీప్ గారిని చూసి అంబులెన్సును పిలిచారు.
స్పృహ కోల్పోయి రోడ్డు మీద నిస్సహాయ స్థితిలో ఉన్న దిలీప్ గారిని అంబులెన్సులోకి షిఫ్ట్ చేస్తున్నపుడు సిబ్బందికి షిఫ్ట్ చేయు విధానము అవగాహన లేకపోవడంతో సరిగా హ్యాండ్లింగ్ చేయకపోవుటవలన దిలీప్ గారి మెడ భాగం విరిగిపోయింది. అందువలన దిలీప్ గారు పూర్తిగా కోమాలోకి వెల్పోయారు. అదే ముంబైలో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నందు అడ్మిట్ చేయబడ్డారు. అడ్మిట్ చేసిన 18 గంటల వరకూ చికిత్స ప్రారంభించలేదు. కంపెనీ వారికి ఈ సమాచారము తెలియగానే వారు వచ్చి భారతదేశంలోనే పేరున్న లీలావతి హాస్పిటల్ నందు దిలీప్ గారిని చేర్చియున్నారు. దిలీప్ గారు 72 గంటల తరువాత స్పృహలోనికి వచ్చారు.
ఈ ఆక్సిడెంట్ కారణంగా మెడకు బలంగా తగలడం వలన దిలీప్ గారికి మెడ కింద భాగం అయిన రెండు కాళ్ళు, చేతులు పనిచేయవు వాటికి స్పర్శ లేదు. ఆయన స్పైనల్కార్డ్ దెబ్బతింది. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాలి ఈ రోజుల్లో ప్రతీ సంవత్సరం 20,000 పైగా కొత్తగా స్పైనల్కార్డ్ ఇంజ్యురీస్ కు గురి అవుతున్నారు. దేశంలో ఇప్పటి వరకూ 15 నుండి 18 లక్షల మంది ఈ వెన్నుముక దెబ్బ తినిన వారున్నారు. దీనికి ప్రపంచంలో ఎక్కడా నివారణ లేదు, ట్రీట్మెంట్ లేదు, సర్జరీ లేదు. ఇలాంటి పరిస్థితులలో జీవితం ముందుకు సాగాలి అంటే పునరావాసం ఒక్కటే మార్గం.
విదేశాలలో స్పైనల్కార్డ్ ఇంజ్యురీ పునరావాసం ద్వారా ఆరు నెలల వ్యవధిలో వీల్ చైర్ ద్వారా వారు సాధారణ జీవితం చేయడానికి వీలు ఉంది. కానీ ఆ సమయంలో మన దేశంలో ఇలాంటి పునరావాస కేంద్రాలు రెండు మాత్రమే ఉన్నాయి. ఒకటి ఢిల్లీలో (Indian Spinal Injuries Centre) ఉంది మరొకటి వెల్లూరు (CMC).
అయితే ఇలాంటి అవకాశము ఉంది అని దిలీప్ గారికి తెలియక 10 సంవత్సరాలు వైజాగ్ హాస్పిటల్ నందు ఉన్నారు. ఈ పది సంవత్సరాలు మంచమునకే పరిమితం అవ్వడం వలన అనేక సమస్యలు తలెత్తాయి. వీపు వెనుక భాగం అంతా పుళ్ళు(bed sores) వేయడం, యూరిన్ ఇన్ఫెక్షన్ రావటం జరిగింది. దిలీప్ గారికి 37 సంవత్సరాలు వయస్సు వచ్చేసరికి ౩౦ సార్లు ఆపరేషన్ చేసియున్నారు. బెడ్ సోర్స్ వలన బాడీ అంత చాలా వాసన రావటం వలన దిలీప్ గారి దగ్గరకు రావడానికి కూడా భయపడేవారని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పియున్నారు. దిలీప్ గారికి సేవ చేయుటకు నిశ్చితార్ధం జరిగిన ఆ అమ్మాయి రెండు నెలల పాటు దిలీప్ గారిని విడిచి పెట్టలేదు. కానీ దిలీప్ గారు ఎంత కాలం బ్రతుకుతారో తెలియని స్థితిలో ఉన్నందున ఆమె కుటుంబ ఒత్తిడి కారణంగా దిలీప్ గారిని విడిచి పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దిలీప్ గారు పది సంవత్సరాలు హాస్పిటల్ నందు ఉన్న సమయములో ఆయన వలే ఇద్దరు ముగ్గురు స్పైనల్ కార్డ్ ఇంజ్యురీ పేషెంట్స్ ఆత్మహత్య చేసుకొన్నారు, ఇంకొందరు ఇన్ఫెక్షన్ చేత మరణించియున్నారు.
Dr. విష్ణు ప్రసాద్ గారని న్యూరో సర్జన్ మరియు ఆర్తోపెడిక్ సర్జన్. ఆయన ఇచ్చిన గైడెన్స్ వలన దిలీప్ గారు జరిగిన దానిని విడిచి పెట్టి జరగాల్సిన దానికోసం ఆలోచించాలని, విలువైన సమయాన్ని వృధా చేయకూడదు అని నిశ్చయించుకొన్నారు. ట్రీట్మెంట్ కొరకు చాలా ధనం ఖర్చు పెట్టినందున హాస్పిటల్ నుండి బయటకి వచ్చిన తరువాత ఏమి చేయాలన్నా ఆయన చేతిలో ధనం లేదు. కంపెనీ రూల్స్ ప్రకారం ఆయనను ఉద్యోగంలో నుండి తీసేసారు.
దిలీప్ గారి స్నేహితులు ఒక కంప్యూటర్ కొని ఇవ్వగా ఇంటర్నెట్ నందు స్పైనల్కార్డ్ ఇంజ్యురీ గురించి బ్రౌస్ చేసినపుడు ఆయనకి స్పైనల్కార్డ్ ఇంజ్యురీ యాహూ గ్రూప్ యొక్క సమాచారము దొరికింది. ఆ గ్రూపులో మెంబెరుగా దిలీప్ గారు జాయిన్ అయిన తరువాత విదేశీయుడు అయిన జోనతాన్ (స్పైనల్ కార్డ్ ఇంజ్యురీ పర్సన్) అను ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
జోనతాన్ ఇండియాకి వచ్చినపుడు ఢిల్లీలో జరిగిన ఆక్సిడెంట్ లో అతనికి స్పైనల్ కార్డ్ ఇంజ్యురీ అయింది. ఇక్కడ ట్రీట్మెంట్ అతనికి సెట్ అవ్వక తిరిగి అతని స్వదేశానికి వెళ్లి ఎనిమిది నెలల వ్యవధిలో తనకు తానుగా డ్రైవింగ్ చేయడములాంటి సామర్ధ్యాన్ని పొందుకున్నారు. అతన్ని దిలీప్ గారు ఇన్స్పిరేషన్ గా తీసుకొని దిలీప్ గారు కూడా నార్మల్ పర్సన్ గా మారుటకు అవసరమైన ట్రైనింగ్ కొరకు జోనతాన్ ను రిక్వెస్ట్ చేసినపుడు అతడు ఇండియాకు వచ్చి రెండు వారాలు ఉండి జీవితం అంటే ఏమిటి అని మొత్తం దిలీప్ గారికి తెలియజేశారు.
స్పైనల్కార్డ్ ఇంజ్యురీలో 5 కారకాలు ఉన్నాయి. నడవలేరు, కూర్చోలేరు, నిలబడలేరు, స్పర్శను కోల్పోవడం మరియు కాలకృత్యాల నియంత్రణను కోల్పోవడం (సాధారణంగా వికలాంగులకు కాలకృత్యాలు నియంత్రించుకొనే వీలు ఉంటుంది కానీ స్పైనల్కార్డ్ ఇంజ్యుర్ద్ వారికి వీలు పడదు). కాబట్టి ఇండియాకి వచ్చిన రెండు వారాలలో జోనతాన్ బొవెల్ మరియు మూత్రాశయ నిర్వహణ, కార్ డ్రైవింగ్ దిలీప్ గారికి నేర్పించారు. దీనివలన అందరిలానే బయటకు తిరుగుటకు సాధ్యపడుతుంది. జోనతాన్ తల్లిగారు ఒక ఆక్టివ్ వీల్ చైర్ ను గిఫ్టుగా ఇచ్చియున్నారు. ఈ విధంగా దిలీప్ గారి జీవితంలో మార్పు రావడానికి పునాది పడింది.
ఈ క్రమంలో కొంత మంది డాక్టర్లు దిలీప్ గారిలో ఇంప్రూవ్మెంట్ చూసి ఆయనలా వెన్నుపాము గాయపడిన పేషెంట్స్ కు కౌన్సెలింగ్ ఇవ్వగలరా అని కోరగా దిలీప్ గారు అంగీకరించారు. ఎందుకంటే జోనతాన్ ఇండియాకి వచ్చినపుడు బీచ్ అంతా తిరిగి చూస్తావా అని దిలీప్ గారు ఆయనను అడిగినపుడు జోనతాన్ అవేమి వద్దు అవకాశము ఉంటే మనలాంటి వాళ్ళకి సహాయం చెయ్యి అని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ మాటను ఒక ఇన్స్పిరేషనుగా తీసుకొని కొంతకాలం దిలీప్ గారు వీల్ చైర్ లోనే హాస్పిటల్స్ కి, పేషెంట్స్ గృహాలకి వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వడం ప్రారంభించారు.
ప్రభావం:
దిలీప్ గారు The Ability People అను పేరుతో రీహాబిలిటేషన్ సెంటరును స్థాపించారు. రోజువారీ జీవన కార్యకలాపాలకు సహాయపడటానికి తగిన సహాయక సాంకేతికతతో అవగాహన, నివారణ, పునరావాసం మరియు ఇతర దేశాలలో ఉన్న వాటితో పోల్చదగిన ఏకరీతి పునరావాస పద్ధతి అత్యవసరం. ఇది వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది మరియు జీవితాన్ని గౌరవంగా ఎదుర్కోవడానికి పునరావాసం కీలకం.
రీహాబిలిటేషన్ సెంటరు ద్వారా గత 18 సంవత్సరాల నుండి మూడు వేల మందికి పైగా స్పైనల్కార్డ్ ఇంజ్యురీ పేషెంట్స్ కి కౌన్సెలింగ్ ఇచ్చి మంచమునకే పరిమితి అయిన వారికి ఒక మార్గదర్శిగా ఉంటూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారు. పునరావాస కేంద్రము వలన ఉపయోగము ఏమిటంటే వారు పేషంట్స్ కు చేపలు ఇవ్వడం లేదు కానీ చేపలను పట్టుకోవడం నేర్పిస్తారు అనగా వారిలో ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసి వారు మరొక పది మందికి ఉపయోగపడేలా చేయటం.
కొంత కాలానికి దిలీప్ గారు పోగొట్టుకున్న ఉద్యోగం మరలా లభించింది. ప్రతీ రెండు సంవత్సరాలకి కంపెనీ దిలీప్ గారికి వీల్ చైరు కుడా అందజేస్తున్నారు.
కేవలం ఒక వ్యక్తి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వలన ఒక సెకండులో 27 సంవత్సరాల కష్టం అంతా వృధా అయిపోగా, జీవితాంతము వీల్ చైరుకు పరిమితమై, ఒకరి సహాయము లేనిదే తన పనులు చేసుకోలేని స్థితిలోకి నెట్ట బడ్డారు దిలీప్ పాత్రో గారు. రోడ్ సేఫ్టీ మీద చాలా మందికి అవగాహన లేక ఇలా ఎంతో మంది వారు కళలుకన్న భవిష్యత్తును చేరుకోలేకపోతున్నారు. దీని కారణంగా దిలీప్ గారు స్టేట్ రోడ్ సేఫ్టీ మరియు డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీలో మెంబరుగా ఉన్నారు. 2007 సంవత్సరంలో “ప్రాజెక్ట్ భవిష్య” ద్వారా 3Rలను (నివారణ నుండి పునరావాసం వరకు) ప్రోత్సహించడానికి వెన్నుపాము గాయపడిన వ్యక్తుల బృందం ఈ క్రింది అంశాలపై TAP (The Ability People)ని ప్రారంభించింది:–
1. రోడ్డు భద్రతా అవగాహన,
2. బాధ్యతాయుతమైన మంచి సమరిటన్లు - అత్యవసర సంరక్షణ మరియు
3.భారతదేశం అంతటా ప్రమాద బాధితులకు పునరావాసం.
దిలీప్ పాత్రో గారు అందించు సర్వీసులు:
వెబ్సైటు : https://theabilitypeople.1ngo.in/
యూట్యూబ్ ఛానల్ : https://youtube.com/@theabilitypeople2342?si=nHgQ5FhnIEeHsJGW
దిలీప్ పాత్రో గారి ఇంటర్వ్యూ వీడియో: https://youtu.be/sax8Ba1UI6U?si=V7T7yCOdCOVS9QUR
మరి కొన్ని రోజులలో అమెరికాకు చేరుకోవలసిన దిలీప్ పాత్రో గారు, కొన్ని రోజులలో వివాహం చేసుకోవలసిన ఆయన జీవితంలో ఎన్నో ఆనందాలను కోల్పోయారు. కొన్నేళ్ళ పాటు మంచానికే పరిమితమైనప్పటికీ నిరాశ, నిస్పృహ చెందకుండా తనకు తానుగా ఇన్స్పిరేషనుగా ఉండటానికి వనరులను వెదికారు. పది మందికి ఉపయోగపడే జీవితాన్ని ఏర్పరచుకొని ఇండిపెండెంట్ గా జీవిస్తూ - జీవితం ఇంతే అనుకుంటే నరకం జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అని దిలీప్ గారు పలికిన మాటలు నిజమని ఆయన తన్నుతాను నిరూపించుకున్నారు. అనేక మంది జీవితాలను ఆనందాల వెలుగులతో తీర్చిదిద్దుతున్నారు. దేవుడు నా నుండి అన్నీ తీసుకొని ఒక మెదడును మాత్రం ఉంచి దాని ద్వారా అనేకమందికి సహాయం చేసే అవకాశం ఇచ్చారు అని చెప్పుతూ దిలీప్ పాత్రో గారు దేవునిని ఏ విధంగా కూడా నిందించలేదు.
దేవుడు పులికి విందు కోసం మాత్రమే జింకను పుట్టించి ఉంటే జింకకు వేగంగా పరిగెత్తే కాళ్ళను ఇచ్చి ఉండరు. అలాగే సమస్యను ఇచ్చి పరిష్కార మార్గాన్ని కుడా ఇచ్చేవారే దేవుడు. ఆ మార్గాన్ని వెదుకుతూ వెళ్ళి జీవితంలో ఎన్నో విజయాలను చూసి అనేకమందికి స్పూర్తిదాయకంగా నిలిచారు.
దిలీప్ గారి ఇంటర్వ్యూ చూసినపుడు ఆయన కూర్చొనియున్న వీల్ చైర్ నందు ప్రతీ రెండు నిమిషాలకి కూర్చోలేక వీల్ చైర్ నందు అటు ఇటు కదులుతూ ఇబ్బంది పడటం నేను గమనించాను. నడవలేని, సరిగా కూర్చోలేని, నిలువబడలేని, స్పర్శను కోల్పోయిన స్థితిలో కూడా ఆయన వలె ఉన్న మరికొందరికి సహాయపడుతున్నారు అని తెలిసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యమును, ప్రోత్సాహమును కలిగింది.
గమనిక: ప్రస్తుతము కృత్రిమ పరికరాలు, కాలిపెర్స్ మొదలగునవి ఒక 50 మంది వరకూ ఉచితముగా సప్లై చేయుటకు వారు సిద్దముగా ఉన్నారు. కావున ఎవరికైనా అవసరమైనచో పైన ఇవ్వబడిన ఫోన్ నెంబరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకొనవచ్చును.
ఈ ఆర్టికల్ చదివిన మీరు కుడా మీ శారీరక లోపాలను గురించి బాధపడుతూ మీ విలువైన సమయాన్ని వృధా చేసుకొనక మీ కంటూ ఒక గమ్యాన్ని ఏర్పరచుకొని ఆత్మ స్థైర్యంతో మొదటి అడుగు వేస్తే విజయం మీ సొంతమవుతుంది.


.jpeg)
.jpeg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి